దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. ఈ నోట్ల లీగల్ టెండర్ ఇంకా కొనసాగుతోందని ప్రకటించింది. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ లేదా, మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. ఇంకా 9,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే నోట్లు తిరిగి రావాల్సి ఉందని పేర్కొంది. ఇదివరకు ఆర్బీఐ (RBI) ఈ నోట్ల మార్పిడికి పుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. దేశంలో 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మేలో ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలను కూడా స్వీకరించబోమని స్పష్టం చేసింది.
అందుబాటులో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడానికి ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ వరకు గడువు ఇచ్చింది. దాని తరువాత 2,000 రూపాయల నోట్ల చలామణికి పూర్తిగా బ్రేక్ పడింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2,000 నోట్ల రూపాయల నోట్లు చలామణిలో ఉండేవి. మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గింది. జూలై 31వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. ఆ నెల ప్రారంభంలో 3.14 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్‌లో చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లు అదే నెల 31వ తేదీ నాటికి 0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19వ తేదీ నుంచి జులై 31వ తేదీ నాటికి 88 శాతం మేర నోట్లు తమ వద్ద జమ అయినట్లు ఆర్బీఐ గతంలో ఓ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం 97.26 శాతం మేర 2,000 రూపాయల నోట్లు రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి వచ్చాయి. ఇంకా 2.74 శాతం నోట్లు ఇంకా ఆర్బీఐకి తిరిగి రావాల్సి ఉంది. వాటి విలువ 9,760 కోట్ల రూపాయలుగా తేల్చింది. వాటి మార్పిడికి గానీ, వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ.. ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో- అవి ఆర్బీఐకి తిరిగిరాకపోవచ్చు.









