AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కౌశిక్‌రెడ్డి కామెంట్లపై ఈసీ సీరియస్.. విచారణకు ఆదేశం

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను తమవైపు తిప్పుకొని గెలిచేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేశారు. రకరకాలుగా ప్రచారం నిర్వహించిన ఓటరు మనసు గెలుచుకునేందుకు ప్రయత్నించారు. కొందరు సెంటిమెంట్‌ను కూడా ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారం చివరి రోజు (నవంబర్ 28న) తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ చోట నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన కీలక కామెంట్స్ చేశారు.

‘మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నాకు ఓటేసి నన్ను గెలిపించండి.. నేను చేయాల్సిన ప్రచారం చేసిన.. ఇక నన్ను సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం.. నన్ను, నా భార్య, నా బిడ్డను సాదుకుంటారో.. ఓడించి ఉరేసుకొమ్మంటారో మీ చేతుల్లోనే ఉంది. ఓట్లేసి గెలిపిస్తే డిసెంబర్ 3న విజయ యాత్రకు నేను వస్తా.. లేకపోతే డిసెంబర్ నాలుగో తారీఖు నాడు నా శవయాత్రకు మీరు రండి.” అంటూ కౌశిక్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కౌశిక్‌రెడ్డి చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. భావోద్వేగ వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ నివేదిక కోరింది.

ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచారు. అక్కడ బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌తో ఆయన పోటీపడుతున్నారు. కౌశిక్‌రెడ్డి తరపున ఆయన కూతురు శ్రీనిక కూడా ఈసారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన శ్రీనిక.. తన తండ్రిని గెలిపించాలని.. తన తండ్రిని గెలిపిస్తే హుజూరాబాద్‌కు రూ.1000 కోట్లు నిధులు తీసుకొస్తాని చెప్పారు. నియోజకవర్గానని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని అన్నారు. పాడి కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.

ANN TOP 10