తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కొద్ది గంటలే మిగిలి ఉంది. ప్రచారంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోన్న కాంగ్రెస్.. బీఆర్‌ఎస్, బీజేపీలకు ధీటుగా ప్రచారం చేస్తోంది. ఓ వైపు ఖర్గే.. మరోవైపు ప్రియాంక.. వేర్వేరు సభల్లో పాల్గొని ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. నేతలెవరైనా.. వేదికలేవైనా.. కేసీఆర్ టార్గెట్‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
కేసీఆర్ బందీ నుంచి తెలంగాణకు విముక్తి కావల్సిన అవసరముందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2014 నుంచి 2018కి బీఆర్‌ఎస్ ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ గ్రాఫ్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను నమ్మకద్రోహం చేసి, దోచుకున్నారని ఆరోపించారు. ఒక దశలో బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందన్న రేవంత్ రెడ్డి.. వచ్చిన అవకాశాలను బీజేపీ చేజార్చుకుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాలం చెల్లిందని, తెలంగాణ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండా అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛ కోసం ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారన్నారు.









