భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 27వ తేదీన కరీంనగర్‌లో రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాల గౌరిశెట్టి వెంకటయ్య మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి హోదాలో తొలిసారి నరేంద్ర మోదీ కరీంనగర్ వస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది భారతీయ జనతా పార్టీ.
ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఎన్నికల సభను విజయవంతం చేసేందుకు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. బహిరంగ సభకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధులంతా సభకు హాజరుకానున్నారు. అటు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ.
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ…తొలిసారి ప్రధాని హోదాలో మోదీ వస్తున్న నేపథ్యంలో బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో దిగ్విజయ వంతం చేయాలని పార్టీ శ్రేణులకు, కరీంనగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రాక కోసం కరీంనగర్ ప్రజానీకం ఎదురు చూస్తోందని, ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామం, మండలం నుండి భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.









