స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలు, ఇంటి మనిషి అయిన కవిత బీఆర్ఎస్, కేటీఆర్, హరీశ్ రావుపై అవినీతి, క్విడ్ ప్రో కో ఆరోపణలు చేసిందని, ఆమె చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఎంపీ అర్వింద్ డిమాండ్..
బీఆర్ఎస్ పార్టీ నిధులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌తో జరిగినట్లు ఆరోపించిన ఒప్పందాలు, ఫీనిక్స్ సంస్థకు రాజకీయ అండ, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు భూముల కేటాయింపులపై కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవని, వీటిపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు.
ఫోన్ టాపింగ్ కుంభకోణం..
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద దర్యాప్తును సీబీఐకి అప్పగించడంలో జరిగిన జాప్యం, ఈ-కార్ రేసులో అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలున్నా విచారణ చేపట్టకుండా కేటీఆర్ ని రక్షించడం, ఫోన్ టాపింగ్ కుంభకోణం బాధ్యులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోపోవడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు ఇప్పటికే శంకిస్తున్నారని చురకలంటించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలు భావిస్తున్నారని అర్వింద్ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని, పూర్తి పారదర్శకతతో నిజానిజాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్వింద్.. రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.








