AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో మాదిరి తెలంగాణలోనూ అధికారం కోసం కోడికత్తి వ్యూహం- రేవంత్ రెడ్డి

కాంగ్రెస్, బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపాయని.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఏపీలో మాదిరి తెలంగాణలోనూ కోడికత్తి వ్యూహాన్ని అమలు చేసి సానుభూతి పొందాలని, అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇది కామన్..
”15 రోజుల్లో ప్రభుత్వంపై కుట్రలు జరగబోతున్నాయని డ్రామారావు అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఇలాంటి దాడులే జరిగాయి. 2018లో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తి దాడి జరిగింది. 2021లో వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ పై దాడి చోటు చేసుకుంది. ఫలితాలు వచ్చిన తర్వాత ఆ దాడుల్లో కుట్ర లేదని తేల్చారు. దాడులు జరుగుతాయంటున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి.

గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి నడుస్తుంటే.. మంత్రి హరీశ్ పరిగెత్తారు
తెలంగాణలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ యువకుడు దాడి చేశాడు. గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి నడుస్తుంటే.. మంత్రి హరీశ్ రావు పరిగెత్తి సురభి డ్రామాను మించి నాటకాలు ఆడారు. ఈ దాడి వెనక కాంగ్రెస్ ఉందని కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసింది. కానీ దాడిలో కుట్ర కోణం లేదని, సెన్సేషన్ కోసమే దాడి అని పోలీసులే చెప్పారు. కేసులో అరెస్ట్ చేసిన ఆ యువకుడి రిమాండ్ రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదు? రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టకపోవడంలో ఆంతర్యమేంటి? హరీశ్ రావుకు, దాడికి పాల్పడ్డ యువకుడికి ఫోన్ సంభాషణ ఏమైనా ఉందా?

సానుభూతి కోసమే కోడికత్తి డ్రామా..
గువ్వల బాలరాజును పరామర్శ పేరుతో డ్రామారావు మరో డ్రామాకు తెర తీశారు. కోడికత్తి వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసి సానుభూతి పొందాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందుకే కేటీఆర్ 15 రోజుల్లో కుట్ర జరగబోతుందని ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. అధికారం కోసం ఎంతటి దారుణానికైనా తెగబడేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.

కాంగ్రెస్ ను బద్నాం చేసే ప్రయత్నం..
మేడిగడ్డ కుంగిన ఘటనలో అసాంఘిక శక్తుల పని అని తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలి. మైనారిటీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మోకాలికి, బోడి గుండుకు లింకు పెట్టి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలు ఎప్పుడో నివేదిక ఇచ్చాయి. డిసెంబర్ లో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే సరిపోతుంది. డిసెంబర్ 4 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణ బిల్లుకు కాంగ్రెస్ అన్ కండీషనల్ మద్దతిస్తుంది. మాదిగలను మరోసారి మోదీ మోసం చేశారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ANN TOP 10