తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అని బండ్ల గణేశ్ జోస్యం చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ విజయంపై నమ్మకంగా ఉన్నారు. తెలంగాణలో ఎక్కడికి పోయినా కాంగ్రెస్ అంటున్నారని, కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని బండ్ల గణేశ్ అన్నారు. ”ప్రజలు డిసైడ్ అయ్యారు. అందరూ డిసెంబర్ 3 కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరు ఏం ఇచ్చినా.. కాంగ్రెస్‌కి ఓటేస్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, సోనియా గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ దూసుకుపోతుంది. బుల్లెట్‌లా రేవంత్ దూసుకుపోతున్నారు” అని బండ్ల గణేశ్ అన్నారు.
”జనాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సోషల్ మీడియాని, నాయకులను మేనేజ్ చేయచ్చు. కానీ ప్రజలను మేనేజ్ చేయలేరు. 2023, నవంబర్ 30వ తేదీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అద్భుతం సృష్టించబోతుంది. దేశం కోసం రాజీవ్ గాంధీ దేహం ముక్కలైంది. ఆయన దేహం ముక్కలు ఏరుకుని రాహుల్ గాంధీ స్మశానికి వెళ్లారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కల కోసం కాంగ్రెస్‌ని గెలిపించాలి. రాహుల్ గాంధీ ఎవడు అని అహంకారంతో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నా శ్వాస కాంగ్రెస్. నా మాట కాంగ్రెస్. అయ్యప్ప మాలతో చెబుతున్నా. కాంగ్రెస్ తెలంగాణను ఏలాలి” అని బండ్ల గణేశ్ అన్నారు.









