రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షదీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అంతేగాక ఉరుములు మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో మూడు గంటలపాటు వర్షం దంచికొట్టింది. కొన్ని చోట్ల తేలికపాటిగా, అక్కడక్కడ భారీ వర్షం పడింది.
అత్యధికంగా భద్రాద్రి-కొత్తగూడెంలోని మద్దుకూరులో 10 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరిలోని నారాయణపూర్‌లో 7.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శేరిలింగంపల్లి, లింగంపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. వచ్చే మూడు రోజులు హైదరాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలతోపాటు మేడ్చల్-మల్కాజిగిరి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.









