ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరుపుతుందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపొచ్చని.. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి అవసరం లేదని కిషన్‌రెడ్డికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు.
కేంద్ర జలశక్తి శాఖే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని తెలిపారు. కేంద్రానికి చెందిన 10 ఏజెన్సీలే కాళేశ్వరానికి అనుమతులిచ్చిందని వెల్లడించారు. అందుకే కేంద్రమే సీబీఐ విచారణ కోరవచ్చన్నారు. అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణ కోరవచ్చన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు. సీబీఐ విచారణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిందితులుగా తేలితే అప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందని నాగేశ్వరరావు వెల్లడించారు.









