కాంగ్రెస్ నుంచి పోటీ
నేడో, రేపో హస్తం గూటికి
శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
ఫ్లాష్.. ఫ్లాష్.. గజ్వేల్ బరిలో మాజీ ఎంపీ విజయశాంతి..అవుననే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి గజ్వేల్‌లో పోటీచేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఆమె అసంతృప్తిగా ఉన్నారని.. నేడో, రేపో పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనంత రసవత్తరంగా ఉండబోతున్నాయి. సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తుండగా.. ఆ రెండు స్థానాల్లోనూ విపక్షాలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్‌లో ఆయన్ను బీజేపీ తరఫున ఈటల రాజేందర్ ఢీకొడుతున్నారు. ఇక కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. కేసీఆర్‌పై ఇద్దరు బలమైన అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో.. ఎన్నికలు ఆసక్తిగా ఉండబోతున్నాయి. సీఎంను ఓడిరచి చరిత్ర సృష్టించాని ఇటు గజ్వేల్‌లో ఈటల, అటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి.. తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీలో చేరిన వెంటనే గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని మారుస్తారని..అక్కడి నుంచి విజయశాంతిని బరిలోకి దింపుతారని టాక్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గజ్వేల్ అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. తూంకుంట నర్సారెడ్డిని ప్రకటించింది. ఐతే విజయశాంతి పార్టీలో చేరితే.. తూంకుంట నర్సారెడ్డి స్థానంలో.. ఆమెను పోటీకి దింపాలని భావిస్తోంది.
ఇప్పటికే బీజేపీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వంటి వారు బీజేపీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్‌లో చేరారు. ఇదే బాటలో విజయశాంతి వెళ్తారని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతి పేరును మొదట చేర్చలేదు. ఆ తర్వాత సాయంత్ర మళ్లీ విజయశాంతి, రఘునందన్ పేర్లను చేర్చడం గమనార్హం.









