–జనం కేక.. బీఆర్‌ఎస్‌లో తికమక
–కాంగ్రెస్ బిగ్‌స్కెచ్‌తో ఎదురుదాడిక
తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బిగ్ స్కెచ్ వేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గులాబీ దళపతి కేసీఆర్‌పై పోటీకి దిగుతుండటంతో కామారెడ్డిలో కాకరేపుతోంది. అలుపెరగని పోరాటం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డికి ఇది నిజంగా అల్టిమేట్ ఫైట్ అనే చెప్పాలి. కేసీఆర్‌ను డైరెక్ట్‌గా ఢీ కొట్టేందుకు రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. పైగా కేసీఆర్‌కు తానే అసలు సిసలు ప్రత్యర్థి అని అంటున్నారు. ఎన్నికల సమరంలో ఇలా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు పోటీకి దిగడం అరుదైన విషయం.
కేసీఆర్ బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్. ఇద్దరూ వేర్వేరు చోట్ల పోటీ చేసి తమ పార్టీ తరఫున ఒకరిని ఒకరు విమర్శించుకోవడం సహజం. కానీ ఆ ఇద్దరే ప్రత్యర్థులు గా మారి ఎదురెదురుగా యుద్ధం సాగించడం అన్నది కీలకమైన పరిణామం. రాష్ట్ర రాజకీయాల్లో ఇది వినూత్నమైన ఘట్టంగానే చెబుతున్నారు. కేసీఆర్‌కు గజ్వేల్ లో చూస్తే తన ఒకనాటి సహచరుడు ‘ఈట’ల రాజేందర్, కామారెడ్డిలో చూస్తే రేవంత్ రెడ్డి (తూటా) పోటీలో ఉండటంతో బీఆర్‌ఎస్‌కు రెండు చోట్లా ఊపిరి సలపని పోరే సాగించాల్సి ఉంటుంది.
ఇదంతా చూస్తుంటే వచ్చే 20 రోజులు ఎన్నికల సమరం హోరెత్తడం ఖాయం అనిపిస్తోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఏ ముహూర్తాన కామారెడ్డి నుంచి పోటీ చేయాలనుకున్నారో..? అప్పటి నుంచి ఆ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓవైపు గజ్వేల్ లో కేసీఆర్ మీద ఈటల పోటీకి సిద్ధమని ప్రకటించగా.. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో కేసీఆర్ ను ఢీకొడతానని స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే, జాతీయ పార్టీలు ఈ మేరకు రెండు సీట్లలో పోటీకి వీరిని అంగీకరిస్తాయో లేదోనని అనుమానం ఉండగా, దానిని పటాపంచలు చేస్తూ టికెట్లు దక్కాయి.
అక్కడ ఇద్దరూ కొత్తే..
కామారెడ్డికి ఇటు కేసీఆర్, అటు రేవంత్ రెడ్డి ఇద్దరూ కొత్తనే. ఇక్కడ ఇద్దరూ తొలిసారే పోటీ చేస్తున్నారు. ఇక సామాజికంగా చూసుకుంటే కామారెడ్డిలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువని చెబుతున్నారు. ఈసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న రెడ్లను ఎదుర్కొంటూ కేసీఆర్ గెలుస్తారా? లేక, ఆయనతో ఢీ అంటూ బరిలో దిగిన రేవంత్ విజయం సాధిస్తారా? అనేది చూడాలి.
కామారెడ్డిలో కలిసొస్తే, లెక్కే వేరు..
టీపీసీసీ చీఫ్ రేవంత్ ను ముఖ్యమంత్రి పైన పోటీకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. అక్కడ సీటు ఆశిస్తున్న షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ ఖరారు చేసింది. ఈ నెల 10న కర్ణాటక సీఎం సిద్దరామయ్య కామారెడ్డిలో పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు. బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారు. అదే రోజున రేవంత్ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేసీఆర్ ను ఢీ కొట్టటం ద్వారా రేవంత్ ఇమేజ్ పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాల్లో భాగంగా అక్కడే బీసీ డిక్లరేషన్ విడుదలకు కాంగ్రెస్ నిర్ణయించింది.
ఇటు రేవంత్ కొడంగల్ తో పాటుగా కామారెడ్డిలో పోటీ చేయటం ద్వారా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో తానే నేరుగా కేసీఆర్ ను ఢీ కొడితే కేడర్ లో జోష్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా కేసీఆర్ కు గెలుపు కష్టతరం చేయాలనేది వ్యూహం. దీని ద్వారా మొత్తంగా ఆ ప్రాంతం పైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సమీకరణాలతో కామారెడ్డిలో కేసీఆర్ వర్సస్ రేవంత్ పోటీ ఆసక్తి కరంగా మారుతోంది.









