AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లీక్

హైదరాబాద్‌లో గ్యాస్ పైప్‌లైన్ లీక్ కలకలం రేపింది. కొంపల్లి- సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లీకైంది. గ్యాస్ పైప్ లీక్ కావటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రధాన రోడ్డు పక్కనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. మంటల్ని చూసి స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. భాగ్యనగర గ్యాస్ సరఫరా పైపు లీక్ అయినట్లు తెలుస్తోంది. రహదారి పక్కనే అభివృద్ధి పనులు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న పోలీసులు అటువైపు వాహనాలు వెళ్లకుండా కట్టడి చేశారు. అనంతరం భాగ్యలక్ష్మి గ్యాస్ అధికారులకు సమాచారమిచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మెయిన్ లైన్ గ్యాస్‌ను ఆపేసిన సిబ్బంది,, పైప్ లైన్‌కు మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10