AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో జెడ్పీ పీఠాల పంపకాల పై కొనసాగుతున్న ఉత్కంఠ..! సీఎం చంద్రబాబుతో జనసేన, బీజేపీ నేతలు భేటీ..

ఏపీలో జెడ్పీ పీఠాల పదవులపై ఉత్కంఠ కొనసాగుతోందా? గడిచిన కొద్ది గంటలుగా జరుగుతున్న ఈ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదా? గురువారం కూడా చర్చలు కంటిన్యూ అవుతున్నాయా? సీఎం చంద్రబాబుతో నాదెండ్ల, మాధవ్ మళ్లీ భేటీ అవుతున్నారా? అవుననే సమాధానాలు వస్తున్నాయి.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందే కాదు.. ఫలితాల తర్వాత పదవుల పంపకాలపై కూటమిలో అంతే ఉత్కంఠ కొనసాగుతోంది. జడ్పీ ఛైర్‌పర్సన్‌, వైస్ ఛైర్మన్ పదవుల పంపిణీపై బుధవారం రాత్రి అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చర్చించారు. కాకపోతే ఎక్కడెక్కడ అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. శుక్రవారం జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల పరోక్ష ఎన్నిక మొదలుకానుంది.

ఇప్పటివరకు జెడ్పీ పీఠాల పంపకాల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. మొత్తం 28 జెడ్పీ ఛైర్మన్ పీఠాలకు గాను 27 ను కూటమి గెలుచుకుంది. టీడీపీ 22 లేదా 23 తీసుకోవాలని భావిస్తోంది. చాలా చోట్ల మున్సిపాలిటీ ఛైర్మన్, మేయర్ పీఠాలకు మిత్రులకు అప్పగించడంతో కేడర్‌లో అసంతృప్తి లేకుండా అడుగులు వేస్తోంది టీడీపీ. జనసేనకు నాలుగు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. బీజేపీ ఛైర్మన్ పీఠం కంటే ఒకటి లేదా రెండు వైస్ ఛైర్మన్ పీఠాలు ఇవ్వాలన్నది ఆ పార్టీ అంతర్గత ఆలోచన.

ఏయే జిల్లాలు ఏ పార్టీకి అన్నదానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లు లేని చోట్ల టీడీపీ జెడ్పీ పీఠాలు తీసుకోవాలని భావిస్తోంది. అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలపై పోటీ నెలకొంది. శ్రీకాకుళం జెడ్పీ పీఠం తమకు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది. అక్కడ కార్పొరేషన్ మేయర్ తీసుకోగా, ఇప్పుడు జెడ్పీ పీఠంపై కన్నేసింది.  అక్కడ ఎన్నికలు ఈనెల చివరలో జరగనున్నాయి.

విశాఖ జెడ్పీ చైర్మన్ పదవిపై అటు ఇటుగా ఉంది. జీవీఎంసీ మేయర్ పదవి దక్కలేదని అసంతృప్తిలో జనసేన నేతలు ఉన్నారు. కేవలం పీఠాలు మాత్రమే కాదని, ఇంకా చాలా పదవులు ఉన్నాయని టీడీపీ చెబుతోంది. పొత్తు ధర్మాన్ని పాటించాలని నేతలకు చంద్రబాబు చెబుతున్నారు. ఒక్క వార్డులో ఓడినా కారణాలను విశ్లేషిస్తామని అన్నారు. టీడీపీ బలంగా ఉన్న చోట్ల జెడ్పీ పీఠాలు తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. సీట్లు తక్కువగా వచ్చిన దగ్గర వైస్ ఛైర్మన్ పీఠాలతో సరి పెట్టుకోవాలని భావిస్తోంది.

ఇక ఎంపీపీ పదవుల బాధ్యతలను జిల్లాల్లోని పార్టీల యంత్రాంగానికి అప్పగించారు. టీడీపీ-జనసేన- బీజేపీలకు ఎక్కడెక్కడ కేటాయించాలనే విషయమై అక్కడి నేతలకు ఫోన్‌ చేసి చెబుతున్నారు. మరికొన్నిచోట్ల స్థానిక ఎమ్మెల్యేలకు ప్రయార్టీ ఇస్తున్నారు. సమస్యలున్న కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడుతున్నారు. గురువారం సాయంత్రం నాటికి జెడ్పీ, ఎంపీపీ పీఠాలు అంశం ఓ కొలిక్కి రానుంది.

ANN TOP 10