AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో 3 ఎకనమిక్ రీజియన్ల ప్రణాళికలు సిద్ధం..! కూటమి సర్కార్ కీలక నిర్ణయం..

రాష్ట్ర సమగ్ర ఆర్థిక పురోగతికి ఊతమిచ్చేలా విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మూడు రీజియన్లలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల పురోగతి, పరిశ్రమల గ్రౌండింగ్ తదితర అంశాలపై అధికారులు సమగ్ర ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రాంతాలవారీగా ప్రత్యేక వనరులను ఆధారంగా చేసుకొని పెట్టుబడులను ఆకర్షించడం, భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన ఎజెండాగా ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం రూపొందించింది.

ఉత్తరాంధ్ర కేంద్రంగా ఉన్న విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్‌) పరిధిలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ ప్రతిపాదించిన 167 ప్రాజెక్టుల్లో ఇప్పటికే 64 పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రాంతానికి ‘వైజాగ్ బే సిటీ’ యాంకర్ ప్రాజెక్టుగా నిలవనుండగా.. మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురంలో ఐటీ, డేటా సెంటర్ హబ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. మరో 15 నుంచి 20 నూతన ఐటీ సంస్థలను విశాఖకు రప్పించడంతో పాటు, ఐటీ రంగంలో 2 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించారు. దీనితో పాటు స్టీల్ సిటీ, కాకినాడ ఇండస్ట్రియల్ సిటీ, పోర్టుల విస్తరణ, కోనసీమ బ్యాక్ వాటర్స్ అభివృద్ధి, అరకు, మారేడుమిల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టులపై దృష్టి సారించారు.

రాయలసీమను సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ రంగాలుగా తీర్చిదిద్దుతూ తిరుపతి ఎకనమిక్ రీజియన్ (టీఈఆర్‌) ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 87 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 66 ప్రాజెక్టులు ఈ రీజియన్‌ పరిధిలోనే ఏర్పాటు కానుండటం విశేషం. స్పేస్, ఎయిర్ క్రాఫ్ట్, డిఫెన్స్, ఈవీ పరిశ్రమలతో పాటు హార్టికల్చర్ హబ్‌లో భాగంగా డెయిరీ, పౌల్ట్రీ, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు రానున్నాయి. ఈ రీజియన్‌లోని 14 పట్టణాలను వివిధ రంగాల పారిశ్రామిక నగరాలుగా మార్చనున్నారు.

మరోవైపు అమరావతి రీజియన్‌లో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, అగ్రి వాల్యూ చైన్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ 48 భారీ ప్రాజెక్టుల ద్వారా ఏకంగా రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులను గ్రౌండింగ్ చేసేలా ప్రణాళికలు ఖరారు చేశారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పనులను వేగవంతం చేసి ఎగుమతులకు ఊతమివ్వడంతో పాటు సూర్యలంక, ఓడరేవు, రామాపురం, నిజాంపట్నం, డిండి తీర ప్రాంతాలను కోస్టల్ టూరిజం హబ్‌లుగా అభివృద్ధి చేయనున్నారు.

ANN TOP 10