భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్‌కు కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు(Rajyotsava award)ను ప్రకటించింది. ఈ ఏడాదికి గాను ఆయనతో పాటు మరో 68మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించే వారికి గౌరవ సూచకంగా ఏటా ఈ పురస్కారాలు అందిస్తారు.
కర్ణాటకలో రెండో అత్యున్నత పౌర పురస్కారంగా భావించే ఈ అవార్డుల్ని నవంబర్ 1న రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రదానం చేస్తారు. వీరితో పాటు 10 సంస్థలకు కూడా ఈ పురస్కారాలను ఇవ్వనున్నట్టు కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి వెల్లడించారు. అవార్డు గ్రహీతలను ఎంపిక చేసే సమయంలో ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించినట్టు తెలిపారు. ఈ ఏడాది పురస్కారాలకు 13 మంది మహిళలు, 64 మంది పురుషులు, ఒక హిజ్రాను సైతం ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ పౌర పురస్కారం కింద రూ.5లక్షల నగదుతో పాటు 25 గ్రాముల బంగారు పతకాన్ని అందించనున్నారు.









