ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం వ్యవసాయ మార్కెట్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను దోచుకోవాలంటే ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ టైంలో మంత్రిని.. కానీ, నిజాయితీగా జిల్లా అభివృద్ధికోసం పనిచేశానని అన్నారు. ఎప్పుడూ రైతునే వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పెట్టేవాళ్లం. ఇప్పుడు ఎవరిని పెట్టారో మీకు తెలుసు. ఒకప్పుడు మార్కెట్ కు సరియైన దారికూడా ఉండేది కాదు.. మా హయాంలో మార్కెట్ ను అభివృద్ధి చేశామని తుమ్మల చెప్పారు.
ప్రకాశ్ నగర్ బ్రిడ్జి ఎక్కడుందో తెలియనోళ్లు ఇప్పుడు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కట్టింది మేమే అంటూ చెప్పుకుంటున్నారు. ప్రజల భూమి కబ్జాలుచేసి కాలేజీ కట్టుకొని చుట్టు పెన్సింగ్ వేసి ఎవ్వరిని రానీయకుండ చేసుకున్నారంటూ తుమ్మల విమర్శించారు. ఖమ్మం గుట్టలను మాయం చేశారు. మట్టి దోచుకున్నారు. మొత్తానికి ఖమ్మంలో అంతా దోచుకునే ముఠాను తయారు చేశారంటూ తుమ్మల మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే అరాచకాలు, దోపీడీ చేసేవాళ్లు ఉండరు. వాళ్ల సంగతి చూస్తాఅంటూ తుమ్మల వ్యాఖ్యానించారు.









