తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాగార్జున సాగర్ లో నిర్మించిన బుద్ధ వనంలో బుద్ధుని పరమ పవిత్రమైన దాతువుల ప్రతిష్టాపన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పూజ్య బిక్షువు డాక్టర్ అజాన్ విసియన్ నేతృత్వంలో బౌద్ద బిక్షువులు పవిత్రమైన దాతువుల ప్రతిష్టాపన చేశారు. ముంబైకి చెందిన బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షులు గగన్ మాలిక్, ఇండోనేషియాకు చెందిన బున్టారియా టిగ్రీస్ , శీలా కుమార కోసన్, మిలియాన్ చంద్ర యానిలింల ద్వారా సేకరించిన బుద్ధుని, 8 మంది అరహతుల దాతువులను ప్రత్యేకంగా అలంకరించిన పగోడాలో బుద్ధవనం ఎంట్రెన్స్ ప్లాజా వద్ద బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు అందించారు. మేళతాళాలు, కోలాటాలతో బౌద్ధ భిక్షువులు ముందుకు సాగగా ఊరేగింపుతో బుద్ధ ధాతువులను మహా స్తూపం వరకు తీసుకెళ్లారు.
మహా స్తూపం అంతర్భాగంలోని మహాయాన బౌద్ధ సంప్రదాయం ప్రకారం దాతు పూజ, బౌద్ధ ప్రార్ధనలతో ఆనంద ఉత్సవాలతో ప్రతిష్టించారు. బుద్ధ ధాతువు ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుద్ధునికి చెందిన ఆరు శారీరక ధాతువులతో పాటు గౌతమ బుద్ధుని అనుచరులైన సారీ పుత్ర, మొగ్గలాన , శివాలీ, అనిరుద్ధ, బకుల, ఉపాలి, ఆనంద సహా మయన్మార్ చెందిన దగోన్ అనే అరహతుల దాతువులను కూడా నిక్షిప్తం చేశారు.









