AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.10 వేల కోసం ఎస్ఐ కక్కుర్తి.. అడ్డంగా దొరికిపోయాడు

తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తుండగా.. పోలీసులంతా కట్టుదిట్టమైన చర్యల్లో నిమగ్నమైపోయారు. ఇదే సందు అనుకున్నాడో ఏమో.. ఈ ఎస్ఐ కాసులకు కక్కుర్తి పడి.. అడ్డంగా బుక్కయిపోయాడు. నిర్మల్‌ జిల్లా మామడ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తోన్న రాజు.. ఓ నిందితునికి స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుని.. అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అనంతపేట్‌ గ్రామానికి చెందిన సుదర్శన్‌, సల్కం సతీష్‌‌ అనే యువకులు అదే గ్రామానికి చెందిన సోప్పరి నరేశ్‌‌తో ఈనెల 24వ తేదీన అంటే దసరా పండుగ తర్వాతి రోజున గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు.

దీంతో.. నరేశ్‌ వాళ్లిద్దరిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. సతీష్, సుదర్శన్ ఇద్దరు కలిసి.. తమకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటూ ఎస్ఐ రాజును బతిమాలారు. అయితే.. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలంటే.. తనకు రూ.10 వేలు ఇవ్వాలని ఎస్ఐ రాజు డిమాండ్‌ చేశాడు.

ఈ విషయాన్ని సతీష్‌ తన సోదరుడు తిరుమల్‌‌కి చెప్పాడు. దీంతో.. లంచం ఇవ్వటం ఇష్టంలేని తిరుమల్.. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు.. పక్కా స్కెచ్ వేసి ఎస్‌ఐ రాజును పోలీసుస్టేషన్‌లో రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఎస్ఐ రాజు మీద కేసు నమోదు చేశారు.

ANN TOP 10