విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50వేల చొప్పున సాయం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.
మరోవైపు రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి ఫోన్ చేశారు. రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు సీఎం జగన్. సహాయ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి పంపించామని, గాయపడ్డ వారికి వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు ఏపీ సీఎం జగన్.
ఘటనాస్థలానికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపించామని, స్థానిక కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని సీఎం జగన్ కేంద్రమంత్రికి వెల్లడించారు. గాయపడ్డ వారికి వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారని, వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని సీఎం జగన్ వివరించారు.









