AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నో ఇన్‌కమింగ్‌.. అంతా ఔట్‌ గోయింగ్‌!

కాంగ్రెస్‌ బాట పడుతున్న కమలం కీలక నేతలు
ఎన్నికల వేళ విచిత్ర స్థితిలో తెలంగాణ బీజేపీ

ఎన్నికల వేళ బీజేపీకి షాక్‌ల మీద షాకులే.. చేరికలకు ఎన్ని ప్రణాళికలు వేసినా బీజేపీలో ఔట్‌ గోయింగే తప్ప ఇన్‌కమింగ్‌ లేని పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలోని నేతలందరూ కాంగ్రెస్‌ బాట పట్టడమే ఇందుకు కారణం. ఇదివరకే.. పార్టీని వీడిన వారిలో స్వామిగౌడ్, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, రాపోలు ఆనందభాస్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎర్రశేఖర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పుష్పలీల, నాగం జనార్దన్‌రెడ్డి ఉండగా.. తాజాగా రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. మరి రేపు ఎవరో ఇలా…తయారైంది బీజేపీ పరిస్థితి..

తమ పార్టీలో గెలిచే తొలి అభ్యర్థి అని చెప్పుకుంటున్న రాజగోపాల్‌రెడ్డి హ్యాండిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. కేసీఆర్‌పై పోరాటంలో బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందంటూ మండిపడ్డారు. ‘బీజేపీ వద్దు.. కాంగ్రెస్‌లో చేరు’ అని అనుచరులు, నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేయడంతోనే తాను పార్టీ మారుతున్నానంటూ ప్రకటించారు. రాజగోపాల్‌రెడ్డి బాటలోనే మరికొంత మంది సీనియర్‌ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఏడాది కాలం పాటు తెలంగాణలో తామే అధికారంలోకి రాబోతున్నామంటూ హడావిడి చేసిన నేతలంతా మెత్తబడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అనే మూడ్‌ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఐదారు నెలల కింద తారాజువ్వల్లా ఎగసి పడిన నేతలు ఇప్పుడు డీలా పడిపోయారు. ఘోరంగా ఓడిపోతే ఉన్న పరువు కాస్తా ఎక్కడ పోతుందో అనే భయంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికే జంకుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉంటే.. డీకే అరుణ, వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, తదితర కీలక నేతలంతా పార్టీని వీడబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది.

ANN TOP 10