తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేదానిపై రెండు పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా ఉన్న బీజేపీ, జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ దగ్గరయ్యాయి. కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. పొత్తుకు తుది రూపు ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
చర్చల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన పవన్ కల్యాణ్ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. జనసేన ఎన్డీఎలో భాగస్వామి కాబట్టి ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కనీసం 32 స్థానాల్లో పోటీ చేయాలన్నది తెలంగాణ జనసేన ఆకాంక్ష. కాని, ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 20 స్థానాలు తమకు కేటాయించాలని ఆ పార్టీ బీజేపీని కోరుతోంది. ఈ మేరకు తమ ప్రతిపాదనను బీజేపీ పెద్దల ముందు బీజేపీ ఉంచినట్టు తెలుస్తోంది.
నవంబర్ ఒకటి తర్వాత బీజేపీ రెండో జాబితా
నవంబర్ ఒకటిన జరిగే CEC సమావేశం తర్వాత తెలంగాణకు సంబంధించి రెండో జాబితాను బీజేపీ విడదల చేయనుంది. అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను తాము కమిటీ ముందుంచుతామని, అందులో ఎన్ని పేర్లకు కమిటీ ఆమోదం తెలుపుతుందో చూడాలని కిషన్‌రెడ్డి తెలిపారు.









