తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరో 40 రోజుల్లోనే ఉన్నాయి.. దాంతో పార్టీలు, అభ్యర్థులు, మేనిఫెస్టోలు, జంపింగ్లపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. రేపు ఢిల్లీలో.. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరిపోతారని కూడా చెప్పేస్తున్నారు.
ఈ ప్రచారాలు ఎవరు చేస్తున్నారో తెలియదు గానీ… సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రమంగా వాయుగుండంలా తర్వాత తుఫానులా మారతాయి. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం వాయుగుండంలా మారింది. దాంతో… ఇది తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తుంటే… దీని వల్ల ఇబ్బందిగా ఫీలవుతున్న బీజేపీ వర్గాలు.. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే, అలాంటిదేమీ లేదు అని చెబుతున్నాయి.
రాజగోపాల్ రెడ్డి… మునుగోడు లేదా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారనీ, అందుకు కాంగ్రెస్ నుంచి అనుకూల వాతావరణం ఉండటంతో… అటు జంప్ అవుతున్నారని అంటున్నారు. నిజానికి ఇదివరకు ఆయన మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేవారు. తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆయన వ్యూహాలు ఫలించలేదు. ఇప్పుడు బీజేపీ రిలీజ్ చేసిన మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంతో, ఆయన అలిగి, కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది.









