అధికారంలోకి రావాలనే ఉక్కుసంకల్పంతో తుక్కుగూడ సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అస్త్రాలుగా మలుచుకుంటోంది కాంగ్రెస్. ములుగు సభలో రాహుల్-ప్రియాంక ఆరు గ్యారెంటీలకు మరింత పదను పెట్టారు. నీళ్లు-నిధులు..నియామకాలకు బీఆర్‌ఎస్ తిలోదాకాలు ఇచ్చిందని విమర్శించారు ప్రియాంక. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని..అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు ప్రియాంక. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ.. పంటలకు మద్దతు ధర.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.
ఆరు గ్యారెంటీలు మాత్రమే కాకుండా..
ఆరు గ్యారెంటీలు మాత్రమే కాదు.. అంతకు మించి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు రాహుల్. మహాలక్ష్మి పథకంతో మహిళలకు నెలకు రూ.2,500.. 500కే గ్యాస్ సిలిండర్.. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు.. రైతు కూలీలకు ప్రతి ఏటా రూ.12 వేలు ఇస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం.. రూ.4వేల పెన్షన్ నిరుద్యోగులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామన్నారు. ఓవైపు ఆకర్షణీయమైన పథకాలను ప్రకటిస్తూ మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ,ఎంఐఎం పై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఇవాళ్టి పర్యటనలో రామగుండం, పెద్దపల్లి..
రాహుల్ -ప్రియాంక పర్యటన టీ కాంగ్రెస్‌కు కొత్త ఉత్సహాన్నిచ్చింది. ఇక ఇవాళ్టి పర్యటనలో భాగంగా.. రామగుండం ఏరియాలో పర్యటించబోతున్నారు రాహుల్ గాంధీ. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మెజారిటీగా ఉన్న కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు పగడ్బందీ వ్యూహరచనతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రామగుండం బొగ్గు గనుల ప్రాంతాల్లో పర్యటించి.. కార్మికులతో ముఖాముఖి కానున్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సెంటినరీ కాలనీ లో కార్మిక సంఘాల నేతలను కలవనున్నారు. అనంతరం Rfcl బాధితులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో బహిరంగ సభ సాయంత్రం ఆరు గంటలకు కరీంనగర్ లో పాదయాత్ర….