పశ్చిమబెంగాల్ సీనియర్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ నివాసంలో సీబీఐ దాడులు చేపడుతోంది. ఆదివారం ఉదయం నుండి మంత్రి నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. దక్షిణ కోల్‌కతాలోని చెట్లా ప్రాంతంలో హకీమ్ నివాసానికి కేంద్ర బలగాలతో పాటు పెద్ద సంఖ్యలో సిబిఐ అధికారులు చేరుకున్నట్లు వెల్లడించారు. ఇద్దరు సిబిఐ అధికారులు హకీమ్‌ను విచారిస్తున్నట్లు తెలిపారు. పురపాలక సంస్థ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసి)లో సీనియర్ నేత, పార్టీలో గణనీయమైన పట్టు ఉన్న హకీమ్ ప్రస్తుతం పట్టణాభివృద్ధి మరియు మునిసిపల్ వ్యవహారాల మంత్రిగా, కోల్‌కతా మేయర్‌గానూ కొనసాగుతున్నారు. సోదాలను వ్యతిరేకిస్తూ.. హకీమ్ మద్దతుదారులు ఆయన నివాసం ఎదుట నిరసన చేపట్టారు. ఇదే కేసుకు సంబంధించి గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఆహార శాఖ మంత్రి రథిన్ ఘోస్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014, 2018 మధ్య కాలంలో రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీల్లో సుమారు 1500 మందిని అక్రమంగా నియమించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.