కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని డబ్బు సంచుల్ని దాచుకుంటోందంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో దోపిడీ పాలన కొనసాగుతోందని, ఈ ఎన్నికల్లో డబ్బు సంచులతో కల్వకుంట్ల కుటుంబం ప్రజల ముందుకు రాబోతుందని పొంగులేటి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పంచే డబ్బు తీసుకుని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన అన్నారు. నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా వారిని ప్రజలు గెలిపించుకోవాలని చెప్పారు.
నల్లగొండ జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ తమ పార్టీనే గెలుస్తుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. తమ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీంలను అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పబోదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మోసకారి పార్టీ అని అన్నారు.