నెహ్రూ జూలాజికల్ పార్క్ లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు దాడి చేయడంతో, జూ ఉద్యోగి మృతిచెందారు. షైబాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ జూలో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఏనుగు అదుపుతప్పి ప్రవర్తించడంతో షైబాజ్ మృత్యువాతపడ్డాడు. 28 ఏళ్ల షైబాజ్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.
నెహ్రూ జూ పార్క్ 60 ఏండ్ల ఉత్సవం సందర్భంగా ఇతర ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లగా, ఏనుగుల ఎన్ క్లోజర్ లో షైబాజ్ ఒక్కడే విధుల్లో ఉన్నాడు. అయితే, ఒక్కసారిగా ముందుకొచ్చిన ఏనుగు అతడిని నేలకేసి విసిరికొట్టింది. ఏనుగు దాడిలో షైబాజ్ కు తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు.