తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. గ్రూప్-1 పరీక్షను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్ తదుపరి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించే సమయంలో ఖచ్చితంగా బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. దీంతో గ్రూప్-1 విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరీక్ష అంటే.. పలువురు అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
తెలంగాణలో రెండో సారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేడు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్ మోషన్ అనుమతి కోరింది. అయితే ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించింది డివిజనల్ బెంచ్. అయితే (మంగళవారం) విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఈ నెల 23వ తేదీన గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే పేపర్ లీకేజీ వల్ల గ్రూప్-1 ప్రిలిమ్స్ ఓసారి రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి రద్దవ్వడంతో అభ్యర్థులతో పాటు కమిషన్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. మరోసారి ప్రిలిమ్స్ రాయాలంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని.. కొన్నిసార్లు ఇదంతా భరించలేక ఆత్మహత్యలే శరణ్యమని భావించే ప్రమాదం కూడా ఉందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది