AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సందడిగా కొత్త పార్లమెంట్‌ భవనం.. ఫొటోసెషన్‌లో పాల్గొన్న ఎంపీలు..

పార్లమెంట్ కొత్త భవనానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, ఎంపీలు అందరూ తరలివచ్చారు. ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో చివరి సంయుక్త సమావేశం జరిగింది. పార్లమెంట్ భవనం, సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… సెంట్రల్ హాల్ సమావేశంలో ప్రసంగించారు. ఈ సెంట్రల్ హాల్‌తో ఎన్నో భావోద్వేగ సంబంధాలు, జ్ఞాపకాలూ ఉన్నాయన్నారు. 41 దేశాల నేతలు ఇక్కడి నుంచే ప్రసంగించారన్న మోదీ.. 86 సార్లు సెంట్రల్ హాల్‌లో దేశ అధ్యక్షుల ప్రసంగాలు జరిగాయన్నారు. ఇక్కడే రాజ్యాంగం, జాతీయ గీతం, జాతీయ పతాకాన్ని ఎంచుకున్నామన్నారు. లోక్‌సభ, రాజ్యసభ కలిసి 4వేల చట్టాలు చేశామన్నారు. ఇక్కడే ఆర్టికల్ 370ని రద్దు చేశామన్న మోదీ… ఇక్కడే చట్టాలు చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశామన్నారు. ఇవాళ కొత్త పార్లమెంట్‌కి వెళ్తున్నామంటూ.. భావోద్వేగ ప్రసంగం చేశారు మోదీ. భారతీయుల ఆశలు నెరవేర్చేలా చేద్దామన్న మోదీ.. భారత్ టాప్ 3 ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని త్వరలో ప్రపంచం చూస్తుందన్నారు.

అంతకుముందు ఉదయం 9.30కి కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీలతో ఫొటో సెషన్ జరిగింది. ఎంపీలంతా అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఒకర్ని ఒకరు పలకరించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడుకున్నారు.

మధ్యాహ్నం 1.15కి లోక్‌సభ సమావేశం జరగనుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశం జరగనుంది. అలాగే… స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశం పాత పార్లమెంట్ భవనంలో జరగనుంది.

ANN TOP 10