స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు వెళ్లిన జగన్..అక్కడ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పచ్చి అవినీతిపరుడని కామెంట్ చేశారు. ఆయన్ని కాపాడటానికి చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వారికి కూడా ఈ అవినీతి, అక్రమాల్లో వాటా ఉందంటూ ఆరోపించారు. ఏపీలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంతో పాటు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికిన వ్యక్తి చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిన వ్యక్తి ఈయన కాదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు చట్టం అందరికి ఒకటే అని చెప్పే చంద్రబాబు ..ఇప్పుడెందుకు అవినీతి కేసులో సాక్ష్యాధారలతో సహా దొరికిపోయారని కామెంట్ చేశారు వైఎస్ జగన్.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో సాక్ష్యాలు,ఆధారాలతో దొరికిపోయిన మహానుభావుడు చంద్రబాబునాయుడ్ని ఇంకా కొందరు కాపాడటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చేసిన దోపిడీ, దొంగతనాలు అక్రమాల్లో వాళ్లు కూడా వాటాదారులే అయి ఉండవచ్చని విమర్శించారు. వెన్నుపోటు పొడిచి రాజకీయాలు చేసే చంద్రబాబు పట్ల జరిగింది అన్యాయమని పచ్చ మీడియా ప్రచారం చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సభలో జగన్ ద్వజమెత్తారు.