AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయి.. : పవన్ కళ్యాణ్

ఏపీ రాజకీయాలు మరో మలుపు తిరిగింది. మొన్నటి వరకు టీడీపీతో పొత్తుపై ఆచీతూచీ మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో పోటీపై కుండబద్దలు కొట్టారు. మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోలేదని.. మొన్నటి వరకు ఆలోచిస్తూనే ఉన్నానన్నారు. కానీ ఇవాళ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.. జనసేన పార్టీ, తెలుగు దేశం కలిసి వెళ్తాయని చెప్పారు. ఈ నిర్ణయం రెండు పార్టీల భవిష్యత్‌కు సంబంధించి కాదని.. రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని.. విడివిడిగా పోటీ చేస్తే దశబ్దాలైనా ఇదే అరాచకం కొనసాగుతుందన్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని.. సీట్ల పంపంకంపై తర్వాత మాట్లాడతానన్నారు. రెండు పార్టీలు కలిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ములాఖత్ రాష్ట్రానికి చాలా ముఖ్యం అన్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి వెళ్లాలనేది తన కోరిక అని చెప్పారు. ఈ విషయాన్ని పదే, పదే చెప్పాను.. బీజేపీకి కూడా చెప్పాను.. పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని భావించాను అన్నారు. సమిష్టిగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే అందరం కలిసి పోటీ చేయాలనేది తన భావన అని వివరించారు. ఈ దుష్ట పాలనను ప్రజలు తీసుకోలేరని.. తాను రోడ్డుపైకి రావడానికి, తెలంగాణ సరిహద్దులో తనను 2వేలమందితో అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక సామాన్యుల్ని బతకనిస్తారా.. జనసేన నేతలు, కార్యకర్తలు ఈ పరిస్థితుల్ని చెప్పాను అన్నారు. తాను ప్రధానిని కలిసిన ప్రతిసారీ జగన్ గురించి చెప్పలేదన్నారు.. ఆయనకు అన్ని విషయాలు తెలుసన్నారు. విశాఖలో ఇబ్బంది పెట్టిన విషయాలు, సినిమాలు ఆపిన సంగతి తెలియదా అన్నారు.

2013లో స్కిల్‌డెవలెప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభమైందని.. ఈ ప్రాజెక్టులో తప్పులు జరిగితే దానికి సంబంధించిన వ్యక్తులపై విచారణ చేయాలన్నారు. సైబరాబాద్ సిటీని నిర్మించిన వ్యక్తికి రూ.317 కోట్లు స్కామ్ పెట్టి జైల్లో కూర్చోబెట్టడం దారుణమన్నారు. అన్యాయంగా కేసు పెడితే ఎలా అని ప్రశ్నించారు.. ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఆర్థిక నేరాల్లో ఉన్న వ్యక్తి అన్నారు. పాలనపరంగా, పాలసీపరంగా విభేదాలు ఉండొచ్చని.. ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా గొప్ప వ్యక్తా అన్నారు. ఆర్థిక నేరాలతో జైల్లో ఉన్న వ్యక్తి.. ఈడీ కేసులు ఉన్నాయన్నారు. కోర్టు అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్లాలని.. అందర్నీ భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తి అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పుల్ని సరిచేసుకుంటే మంచిదన్నారు.

ANN TOP 10