యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతపూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండకింద సత్యనారాయణస్వామి వ్రతమండపం రెండో హాల్‌లో వ్రత పూజలు కొనసాగాయి. మహాలక్ష్మి అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి వ్రత మండపం హాల్ ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. ఉదయం 10గంటలకు దేవస్థాన అర్చక, పురోహిత, వేదపండిత బృందం శైవాగమ పద్ధతిలో విఘ్నేశ్వరుడికి తొలిపూజలతో వ్రతపూజలు ఆరంభించారు.
మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ విశేష పూజలు నిర్వహించి సహస్రనామాలతో వివిధ రకాల పుష్పాలు, కుంకుమలతో అర్చించారు. పూజల అనంతరం మహిళలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో వాయినాలు ఇచ్చారు. ఈ విశేష వ్రతపూజలను దేవస్థాన ప్రధానార్చకుడు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహచార్యులు, ప్రధాన పురోహితుడు గౌరిభట్ల సత్యనారాయణశర్మ, అర్చకులు నిర్వహించారు. వైదిక పర్వాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.









