AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

20 ఏళ్లు కూడా నిండకుండానే.. ఆన్‌లైన్‌ బెట్టింగ్స్‌కు బలై..

యువత ప్రస్తుతం మద్యానికి కన్న ఎక్కువగా ఆన్‌లైన్‌ బెట్టింగ్ లకు బానిసలుగా మారుతున్నారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన వాళ్లు నిండు ప్రాణాలను తీసుకుంటూ వారి కుటుంబాటినకి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. మాయదారి స్మార్ట్ ఫోన్లు ఏమంటూ మనుషులు జీవితాల్లోకి వచ్చాయో బతుకులను ఆగం చేస్తున్నాయి.

సోషల్‌ మీడియా ఊబిలో ఇరుక్కుపోయే వారు కొందరైతే ఆన్‌లైన్‌ బెట్టింగ్స్‌కు బలైపోతున్న వారు మరికొందరు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు పెడుతూ ప్రాణాలే కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అప్పుల మీద అప్పులు చేసి తీరా ఉరికొయ్యలకు వేలాడుతూ అసువులు బాస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఓ ఘటన కలకలం రేపింది. దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిరుగు వెంకట్ గౌడ్, లలిత దంపతుల కుమారుడు సతీష్ గౌడ్ దౌల్తాబాద్‌లో ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. అనంతరం స్మార్ట్ ఫోన్‌లో బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఈ వ్యసనానికి బానిసై ఏకంగా రూ.3 లక్షలు పోగొట్టుకున్నాడు.

అప్పు ఇచ్చిన వారు ఇంటి వద్దకు రావడంతో ఒకసారి సతీష్ తండ్రి వెంకటేష్ తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మి అప్పుల వాళ్ళకి అప్పు చెల్లించాడు. తర్వాత కొడుకు జీవనాధారం కోసం ఒక ఒక పాల కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నా సతీష్ తిరిగి ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్‌లో మళ్లీ డబ్బులు పెట్టడం ప్రారంభించాడు. ఇదే క్రమంలో మరోసారి పెద్ద మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాడు. పాల వ్యాపారంతో వచ్చిన డబ్బులతో మళ్ళీ ఆన్‌లైన్‌ బెట్టింగులు చేయడంతో తల్లితండ్రులు మందలించారు. అయితే అప్పటికే అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడం ప్రారంభించారు.

దీంతో అప్పుల బాధలు భరించలేని సతీష్‌.. బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన సొంత వ్యవసాయ పొలంలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోని మృతి చెందడంతో సతీష్‌ పేరెంట్స్‌ రోదనకు అంతు లేకుండా పోయింది. కన్న కొడుకు తమకు తల కొరివి పెడుతారనుకున్నాము కానీ ఇలా తామే కొడుకు మృతదేహానికి చితి పెట్టాల్సి వస్తుందని ఊహించలేదంటూ బోరుమంటున్నారు. పాతికేళ్లు కూడా నిండని కుర్రాడు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10