ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వర రావు ఇంటికి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఆయన ఖమ్మం వెళ్లి.. తుమ్మలను కలిశారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతగా మర్యాదపూర్వకంగా కలిశారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన మాత్రమే కాదు.. వారం నుంచి కాంగ్రెస్ నేతలు ఈ దిశగా ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తుమ్మలను కలిసి.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత నిన్న మరో సీనియర్ నేత, ఈమధ్యే కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా.. తుమ్మల ఇంటికి వెళ్లి.. ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు భట్టి విక్రమార్క కూడా వెళ్లడంతో.. తుమ్మల హస్తం గూటికి వస్తారనే అంచనాలు బలపడ్డాయి. ముఖ్యంగా భట్టి విక్రమార్కకు ఖమ్మంలో భారీగా కార్యకర్తల సపోర్ట్ ఉంది.
మాజీ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వర రావుకి బీఆర్ ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో.. ఆయన ఎలాగైనా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. పోటీ చేస్తానని ప్రకటించారు కూడా. అయితే.. అయిన కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆయనను పాలేరు లేదా ఖమ్మం నుంచి పోటీ చేయించడానికి కాంగ్రెస్ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదిలావుండగా.. భట్టి ఆహ్వానానికి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. నలబై ఏళ్లుగా తనను ఇంతటి వాడిని చేసిన అనుచరులు, మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల అన్నారు.









