AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యే బరిలో నిలుస్తా.. సర్పంచ్ నవ్య

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హడావిడి మొదలైంది. రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. మేమంటే మేము అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీలు.. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కాకుండా.. ఈసారి కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు కేసీఆర్. అందుకు కారణం.. సర్పంచ్ నవ్య నుంచి వచ్చి కీలక ఆరోపణలే అన్న విషయం అందరికీ తెలిసిందే.

రాజయ్య మాత్రం ఇల్లు అలకగానే పండుగ కాదని.. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. ఏ క్షణం ఏమైనా జరగొచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తాను అనుకున్నది జరుగుతుందని.. కేసీఆర్ మళ్లీ తనకు అవకాశం ఇవ్వనున్నారనే ఇంకా ఆశిస్తున్నారు. అయితే.. ఆయన ఏది దృష్టిలో పెట్టుకుని ఇంకా టికెట్‌ మీద ఆశపడుతున్నారో.. తెలియదు కానీ.. ఇప్పటికీ అసమ్మతి గళాన్ని మాత్రం వినిపించకుండా ఓపికగా ఉంటున్నారు. కార్యకర్తలతో మమేకమవుతూ.. తన కన్నీళ్లతో సానుభూతిని కూడగట్టుకుంటున్నారు.

ఇంత వరకు బాగానే ఉంది కానీ.. జానకీపురం సర్పంచ్ నవ్య. “బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సార్, కేటీఆర్ అన్న అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నా.. మీ ఆశీర్వాదం, సహకారం ఉంటే గెలిచి చూపిస్తా..” అంటూ సర్పంచ్ నవ్య ఓ ఇంటర్వూలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

అయితే.. సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణల వల్లే తాటికొండ రాజయ్యకు టికెట్ రాలేదన్న వాదనల నడుమ.. ఇప్పుడు తాను కూడా పోటీలో ఉంటానంటూ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. అందుకు సంబంధించి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సర్పంచ్ నవ్య బాధ ఇక తప్పిందనుకుంటున్న వేళ.. మళ్లీ ఇలా నేనొస్తా ఎమ్మెల్యే బరిలోకి అంటుండటంతో.. రాజయ్యకు మళ్లీ తలనొప్పి మళ్లీ మొదలైందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10