AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దారిలో గొయ్యి.. ‍ప్రజ్ఞాన్ రోవర్‌కు తప్పిన పెను ప్రమాదం

గతవారం చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ అన్వేషణ కొనసాగుతోంది. ల్యాండర్ విక్రమ్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడిపై అధ్యయనం సాగిస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువానికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ తెలియని సమాచారాన్ని ప్రజ్ఞాన్ సేకరిస్తోంది. ఈ క్రమంలో రోవర్ ఓ ప్రమాదాన్ని అధిగమించింది. ఇస్రో అప్రమత్తం చేయడంతో 4 మీటర్ల లోతైన గోతిలో పడే ముప్పును రోవర్ తప్పించుకుంది. భూ కేంద్రం నుంచి అందిన సూచనలతో తన దిశను మార్చుకుని సురక్షిత మార్గంలో ప్రయాణం మొదలుపెట్టింది.

ఆదివారం నాడు మరో 3 మీటర్ల దూరంలో గొయ్యి ఉందనగా.. గ్రౌండ్ కమాండో కంట్రోల్ స్టేషన్ నుంచి రోవర్‌కు శాస్త్రవేత్తలు సంకేతాలు పంపారు. ఈ మేరకు రోవర్ గమనానికి సంబంధించిన రెండు ఫొటోలను ఇస్రో పంచుకుంది. అందులో గొయ్యి ఉన్న ప్రాంతం, కొత్త దారిలో ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణిస్తున్న మార్గాన్ని చూడవచ్చు. మరోవైపు, చంద్రుని ఉపరితలంపై దక్షిణ ధ్రువం చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతలను చంద్రయాన్-3 కొలిచినట్టు ఇస్రో వెల్లడించిన విషయం తెలిసిందే.

మరోవైపు, చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ దేశమూ తీయని అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ కూడా వెల్లడించారు. అవి తమ కంప్యూటర్‌ కేంద్రానికి వెళుతున్నాయని, అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్‌ చేస్తున్నారని.. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామని తెలిపారు. జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌, విక్రమ్‌ ల్యాండర్‌ సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని పరిశోధనల్లో భాగంగా రోవర్‌ కచ్చితంగా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. రాబోయే 10 రోజుల్లో ల్యాండర్‌, రోవర్‌లు అన్ని పరిశోధనలను పూర్తిచేస్తాయని తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10