ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… ఈ ఆదివారం ఆల్ ఇండియా రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 104 ఎపిసోడ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడూ విజయం దిశగా అడుగులు వేసే భారత్‌కి.. చంద్రయాన్-3 మిషన్ విజయం ఒక సింబల్‌లా మారిందన్నారు మోదీ. మహిళా శక్తికీ, సాధికారతకూ ఈ ప్రయోగం సింబల్ అన్నారు. ఈ ప్రయోగంలో మహిళా శాస్త్రవేత్తలు కూడా పాల్గొనడాన్ని ఆయన కీర్తించారు.
సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే G20 సదస్సుకు భారత్ సిద్ధమవుతోందన్న మోదీ.. 40కి పైగా దేశాల ప్రతినిధులు భారత్ వస్తారని తెలిపారు. తొలిసారిగా ఇండియా ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తోందన్న మోదీ.. దీన్ని ప్రత్యేకంగా నిర్వహిద్దామని కోరారు. దేశ ప్రజలంతా ఇందులో భాగస్వామ్యమే అన్నారు.
క్రీడా విభాగాల్లో యువత బాగా రాణిస్తున్నారన్న ప్రధాని మోదీ .. వరుసగా సరికొత్త విజయాలు సాధిస్తున్నారని మెచ్చుకున్నారు. ఇటీవల జాతీయ జెండాను ఎగరేసిన విన్నింగ్ ప్లేయర్లను మోదీ ప్రశంసించారు. వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ 2023లో మెడల్స్ సాధించిన విద్యార్థులతో మోదీ మాట్లాడారు.
నా మట్టి, నా దేశం కార్యక్రమం గురించి ప్రస్తావించిన మోదీ.. ఇది బాగా జరుగుతోందన్నారు. సెప్టెంబర్‌లో దేశంలోని ప్రతీ ఇల్లు, ప్రతీ గ్రామం నుంచి మట్టిని సేకరించి.. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని ప్రస్తావించిన మోదీ.. ఈసారి తనకు సంస్కృతంలో చాలా లేఖలు వచ్చాయి అన్నారు. అందరూ సంస్కృతం నేర్చుకోవాలని కోరారు.









