ఎల్బీనగర్ పోలీసుల చేత గిరిజన మహిళ దాడికి గురైన ఘటన మరవకముందే.. నందనవనంలో దళిత మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడి జరగడం చాలా బాధాకరమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ సాధించి బంగారు పాలన అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న కేసీఆర్.. నందనవనం, సింగరేణి కాలనీ, అడ్డగుట్టకు వస్తే వాస్తవం తెలుస్తుందని ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్ట్ షాపులు, మాదకద్రవ్యాల రహిత ఎల్బీనగర్ కోసం బీజేపీ నాయకులు చేపట్టిన దీక్షా శిబిరంలో ఈటల పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ.. మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు.
అర్ధరాత్రి వేళ రోగం వస్తే మందులు దొరకవు కానీ.. మందుబాబులకు మద్యం దొరుకుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. రోజురోజుకూ లైంగికదాడులు పెరిగిపోతున్నాయని దుయ్యబట్టారు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా.. కేసీఆర్కు ఓటు వేసిన పాపానికి రాష్ట్రప్రజలకు దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామన్న కేసీఆర్.. ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. వారికి భూములు ఇవ్వకపోగా బడా బాబులతో కుమ్మక్కై దళితుల భూములనే కబ్జా చేస్తున్నారని దుయ్యబట్టారు.