AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీపీఐ, సీపీఎంలకు కేసీఆర్‌ బిగ్‌ షాక్‌

గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఇంచుమించు అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో వామపక్షాలైన సీపీఐ, సీపీఎం పార్టీలకు ఊహించని షాక్‌ తగిలినట్టయ్యింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పొత్తును కొనసాగిస్తుందనే వార్తలు వచ్చాయి. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో సీటు లేదా చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కేసీఆర్‌ సముఖత వ్యక్తం చేశారనే ఊహాగానాలు కూడా వచ్చాయి.

పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్‌ … త్వరలోనే దీనిపై చర్చించేందుకు తమకు కబురు పంపుతారని వామపక్ష నేతలు కూడా చెబుతూ వచ్చారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. వామపక్షాలకు సీట్లు కేటాయించలేదు. ఒకవేళ వారితో పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యంతో ఉంటే వారికి కేటాయించే సీట్లను పెండింగ్‌లో పెట్టేవారు. కానీ అలా జరగలేదు. వామపక్షాలు ఆశిస్తున్న స్థానాల జాబితాలో బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, మిర్యాలగూడ, భద్రాచలం, కొత్తగూడెం వంటివి ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన జాబితాలో ఇక్కడి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పోటీ చేయడం ఖాయమైంది. దీంతో వామపక్షాలతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్‌ సుముఖంగా లేరనే విషయం స్పష్టమవుతోంది.

ANN TOP 10