తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అధికారపార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. బరిలో ఉండే అభ్యర్థులను ముందుగానే ప్రకటించనున్నట్లు గులాబీ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు వారం తెలిపారు. సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. ఆ తర్వాత మంత్రులు, నేతలతో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మొదటి జాబితాను విడుదల చేయనున్నారు.
దాదాపు 10 నుంచి 15 స్థానాల్లో సిట్టింగ్ లను మార్చే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగింది. దీంతో గత ఐదు రోజుల నుంచి అటు సిట్టింగ్‌లు, ఇటు ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. అసమ్మతిని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఆశావహులు టికెట్ వస్తుందా..? రాదా.. అనే ఊహగానాల మధ్య.. తమకే టికెట్ ఇవ్వాలంటూ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితను కలిసి విన్నవించుకున్నారు. 104 మందిలో 11 మందికి టికెట్ డౌట్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసమ్మతిని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఈసారి తమకే టికెట్ ఇవ్వాలంటూ కోరారు. 12 మంది నేతలు కవితతో భేటీ అయి తమ వాదనను వినిపించారు. ఆఖరు నిమిషం వరకూ టికెట్ కోసం ప్రయత్నాలు చేయగా.. వారి విన్నపాలను హరీష్, కవిత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బీఆర్ఎస్ టికెట్ల ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం నెలకొంది.