– పథకాలతో పాటు గ్లామర్ కోసం ప్లాన్
– కేసీఆర్ తో చర్చించిన మాజీ ఎంపీ
– త్వరలోనే ముహూర్తం ఖాయమంటున్న గులాబీ నేతలు
ఒకప్పటి వెండి తెర వెలుగుల రాణి, మాజీ ఎంపీ జయప్రద రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలం కాబోతున్నారా…. అధికార బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ హ్యాట్రిక్ విజయంలో తనవంతు పాత్ర కూడా ఉండాలని భావిస్తున్నారా… అంటే అవునన్న సమాధానం ప్రగతి భవన్ నుంచి వస్తోంది. తెలుగు సినీ రంగాన్ని ఒక ఊపు ఊపి తనదైన శైలిలో నటించి మెప్పించిన జయప్రద ఆ తర్వాత టీడీపీ ద్వార రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనంతరం యూపీ రాజకీయాల్లోకి వెళ్ళి సమాజ్ వాది పార్టీ తరఫున లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కొంత కాలం క్రితం బీజేపీలో చేరినప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.
రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్న జయప్రదను మరోసారి క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. పార్టీలో చేరి ప్రచారం చేయాలని కోరిన సీఎం కేసీఆర్ ఇప్పటికే రెండు మూడు సార్లు భేటీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఇటీవల జయసుధ చేరారు. అంతకంటే ముందుగా బీజేపీలో విజయశాంతి, జీవితలు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ పథకాలకు తోడుగా సినీ గ్లామర్ ఉంటే ప్రజలు మరింత ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయంతో ఉన్న బీఆర్ఎస్ బిగ్ బాస్ జయప్రదను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తే రాబోయే కాలంలో రాజ్యసభ సీటును ఇస్తామని కూడా జయప్రద ముందు బీఆర్ఎస్ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.









