భారతీయ రైల్వేలో ఇదో చరిత్రాత్మక రోజుగా చెబుతున్నారు. దేశంలోని 508 రైల్వేస్టేషన్లను సరికొత్తగా, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దే భారీ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్‌గా పునాది రాయి వేశారు. అమృత భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఉన్న ఈ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ రూ.24,470 కోట్లను ఖర్చు పెట్టనుంది. తెలంగాణలో 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్ పేట, మలక్ పేట, మల్కాజిగిరి ఉప్పుగూడతోపాటు ఆదిలాబాద్, భద్రాచలం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్, రామగుండం, తాండూరు, రాయగిరి, జహీరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ కింద తొలి విడుతలో రాష్ట్రంలో రూ.898 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరగనున్నాయి.
రైల్వే రంగంలో ఈ అభివృద్ధి విప్లవాత్మకంగా ఉంటుందని మోదీ తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందన్నారు. స్థానిక సంస్కృతులు, వారసత్వం, కళలను దృష్టిలో ఉంచుకొని.. అందుకు తగ్గట్టుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతుంది అని మోదీ తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ప్రకారం.. రైల్వేస్టేషన్లను సిటీ సెంటర్లుగా తీర్చిదిద్దుతారు. ప్రతీ సిటీకీ ప్రారంభం, చివర్లో రెండేసి స్టేషన్లను అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్స్ సిద్ధమవుతున్నాయి.
508 స్టేషన్లూ.. 27 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్‌లో 21, తెలంగాణలో 21, జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్‌లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని మేఘాలయ , నాగాలాండ్‌లో ఒక్కో స్టేషన్‌ని అప్‌గ్రేడ్ చేస్తారు.









