తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా అన్ని వర్గాలను ఆకట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాల ప్రకటను సిద్దమయ్యారు. ఈ రోజు అసెంబ్లీలో ఉద్యోగుల పీఆర్సీ తో పాటుగా మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీంతో పాటుగా మరిన్ని కీలక ప్రకటనలు చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఎన్నికల ముందు దాదాపు ఇవే చివరి సమావేశాలుగా భావిస్తున్నారు.
అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తే మినహా.. సభా సమావేశం అయ్యే అవకాశం లేదు. ఈ సమయంలో ఈ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నుంచి ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా సాధించిన విజయాలతో పాటుగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా పీఆర్సీపై ప్రకటన చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వివిధ వర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ విషయంలో కూడా ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. పీఆర్సీ ఏర్పాటు ప్రకటనతోపాటు మధ్యంతర భృతి (ఐఆర్)ని కూడా ముఖ్యమంత్రి ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలు, వరదలపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. పంట నష్టం ఎంత జరిగిందన్న వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.









