AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బస్సులో బుస్ బుస్..

నిర్మల్ జిల్లా ఆర్టీసీ బస్సులో పాము కలకలం రేపింది. రద్దీగా ఉన్న బస్‌లో ఒక్కసారిగా వింత శబ్దాలు రావడం.. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో చూడగా.. ప్రయాణీకులకు నాగుపాము దర్శనమిచ్చింది. అది బుసలు‌కొడుతుండటంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారంతా భయంతో కేకలు వేయడంతో.. వెంటనే అలర్ట్ అయిన బస్ డ్రైవర్ బస్సును పక్కకు ఆపి వేశాడు. అనంతరం ఓ ప్రయాణికుడు పక్కనే కర్రతో పాముపై దాడి చేసి చంపారు.. దీంతో ఆ బస్సులోని మిగిలిన ప్రయాణికులంతా హమ్మయ్య.! అనుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామం వద్ద చోటు చేసుకుంది. బైంసా నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసి బస్సులో ఈ నాగుపాము కనిపించగా.. దాన్ని చూడగానే ప్రయాణికులంతా ఒక్కసారిగా కేకలు వేయగా.. ఆర్టీసీ బస్ డ్రైవర్ సైతం ఆందోళనకు గురయ్యాడు. నర్సాపూర్ గ్రామం వద్ద బస్సును నిలిపివేసి పాము కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కండక్టర్ వెనుక సీట్లో పాము నక్కి ఉండటంతో జావేద్ అనే ప్రయాణికుడు ధైర్యం చేసి ఆ పామును హతమార్చాడు. అంతా మంచికే జరిగిందని.. ఒకవేళ మార్గం మద్యలో ఎవరిపైనైనా పాము దాడి చేసి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో అంటూ నిర్మల్ చేరేంత వరకు చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు ప్రయాణికులు. కాగా, ఆ బస్సులోని ఓ ప్రయాణీకుడు ఈ తతంగం మొత్తం వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది కాస్తా వైరల్‌గా మారింది.

ANN TOP 10