ఎగువన మహారాష్ట్ర, చత్తిస్‌గడ్ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరి పరివాహంగా పెన్‌గంగ, వార్ధా, ప్రాణహిత, ఇంద్రావతితోపాటు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. శుక్రవారం ఉదయం నుంచి గోదావరి నదిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. తాజా సమాచారం మేరకు భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం 53అడుగులకు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ,మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అర్ధరాత్రికి నదిలో నీటిమట్టం 58అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కలెక్టర్ ప్రియాంక ఎప్పటికపుడు వరద పరిస్థితులను సమీక్షిస్తూ అధికార యంత్రాగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణంలోకి వరద నీరు ప్రవేశించింది. రామాలయం చుట్టు వరదనీరు చుట్టుముట్టింది. బారీ మోటార్లతో నీటిని తోడిపోస్తున్నా పరిస్థితి దారికి రావటం లేదు.
శ్రీరాంసాగర్‌కు 1.75లక్షల క్యూసెక్కులు
ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1.75లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు 18గేట్లు ఎత్తివేశారు. 58వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 6.44లక్షల క్యూసెక్కులు ఉండగా , 6.94లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.









