తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. తాజాగా మళ్లీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
హైదరాబాద్ జంట నగరాల్లో వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి సాధారణంగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. కుండపోత వాన కుమ్మరించింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, యూసఫ్ గూడ, బోరబండ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది.
ఇదిలా ఉంటే.. నగరంలో భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని డీఆర్ఎఫ్ బృందాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.