AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

19న కర్ణాటక మంత్రులతో రాహుల్‌ ప్రత్యేక భేటీ

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈనెల 17 నుంచి బీజేపీ వ్యతిరేక పార్టీల కూటమి రెండు రోజుల సదస్సు బెంగళూరులో జరగనుంది. ఈ సమావేశాలకు సోనియాగాంధీ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీల ముఖ్యులు భాగస్వామ్యులు కానున్నారు. ఇదే సమీక్షలో రాహుల్‌గాంధీ కూడా పాల్గొంటారు.

రెండురోజుల తర్వాత కూడా రాష్ట్రంలోనే ఉండే రాహుల్‌గాంధీ 19న రాష్ట్ర మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ సహా 34 మందిని ఢిల్లీ రావాలని జూన్‌లో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కానీ వివిధ కారణాలతో సదరు సభ వాయిదా పడింది. ప్రస్తుతం బెంగళూరుకే రాహుల్‌గాంధీ వస్తున్న తరుణంలో ఇక్కడే మంత్రులతో భేటీ కావాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా పాల్గొననున్నారు. నగరంలోని ఓ స్టార్‌ హోటల్‌లో సమావేశం జరగనుంది. కాగా మంత్రులతో రాహుల్‌గాంధీది అధికారిక సమావేశం కాదని, పార్టీ పరమైన సమావేశమని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేశాయి.

ANN TOP 10