సర్కార్ బడి రూపురేఖలు మార్చిన హిమాన్షు
బడి దత్తతకు స్ఫూర్తి తాతే: సీఎం కేసీఆర్ మనవడు
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ఓ మంచి పని చేశాడు. ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆధునిక హంగులను సంతరించుకుంది. సౌకర్యాలలేమితో కునారిల్లుతున్న ఈ బడిని హిమాన్షు దత్తత తీసుకున్నారు. తాను సేకరించిన నిధులతో బడిని ఆధునికీకరించారు.
బడిలో కొత్తగా కల్పించిన సౌకర్యాలను తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిమాన్షు భావోద్వేగంగా ప్రసంగించారు. తాను తొలిసారిగా ఈ బడిని సందర్శించినప్పుడు సౌకర్యాల లేక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చూసి ఎంతో బాధపడ్డానని.. కళ్లలోంచి నీళ్లొచ్చాయని హిమాన్షు పేర్కొన్నారు. బడి అన్నాక కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోతే ఎలా? అనే భావన మెదిలి తన మనసు చలించిపోయిందన్నారు.
ఓ పిల్లాడు మెట్ల మీది నుంచి జారి పడ్డడు.. హెడ్ మాస్టర్ ఆఫీసు రూంలో స్టూడెంట్స్ ఉన్నరు.. ఇదే స్టాఫ్ రూమ్, క్లాస్ రూమ్, స్టోర్ రూమ్ కూడా అని చెప్పారు. అది చూసి నేను షాకయ్యా. వంద శాతం ఇది నాకు కొత్త.. ఆ బాధను నేను మాటల్లో చెప్పలేను’ అంటూ హిమాన్షు చెప్పుకొచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడికి వెళ్లాక తన వాహన డ్రైవర్ చెబితే తప్ప అది పాఠశాల అని తాను నమ్మలేకపోయానన్నారు. బడి అంతా కలియతిరిగి తరగతి గదులు, స్టేషనరీ, ఫర్నిచర్ పరిశీలించానన్నారు. ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడాలని అడిగి.. ఆయనతో కలిసి ఆఫీసు రూంలోకి వెళ్లాననని అక్కడ విద్యార్ధులంతా కూర్చుని ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. ‘‘మీ ఆఫీసు రూమ్‌లో విద్యార్థులు ఉన్నారేమిటి? సార్?’’ అని తాను ప్రధానోపాధ్యాయుడిని అడిగితే.. ‘‘సార్.. ఇదే మా ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూమ్, క్లాస్ రూమ్.. స్టోర్ రూమ్’’ అని ఆయన చెప్పారని.. ఇది తనకు షాక్‌కు గురిచేసిందని హిమాన్షు వివరించారు.
ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న తనకు ప్రభుత్వ బడిలోని హెడ్మాస్టర్ గది స్థితిని చూసి మాటల్లో చెప్పలేనంత బాధ కలిగిందని.. ఇట్లాంటివి తాను ఇంతకుమందెప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల స్థితి చూశాక.. బడి ఆధునికీకరణలో భాగంగా ఏవో గోడలు కట్టిస్తే సరిపోదని.. చాలా పనే చేయాల్సి ఉందని అమ్మ శైలిమకు చెప్పానని, అంత ఫండ్ రాలేదని ఆమె నాతో అన్నారుని వెల్లడించారు. తాను రూ.40 లక్షల దాకా సేకరించానని.. వీటికి తోడు డీఈసీ ఇన్‌ఫ్రా మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌గుప్తా సహకరించడంతో ఆధునికీకరణ పనులు పూర్తిచేశామని చెప్పారు. డైనింగ్ హాల్, బాలికలు, బాలురకు వేర్వేరు మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, ఆధునిక తరగతి గదులు, పాఠశాలకు డిజిటల్ నేమ్‌బోర్డు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నాన్న కేటీఆర్, ఆయన బృందం సహకారంతో పనులను విజయవంతంగా పూర్తిచేశామన్నారు.
మొత్తానికి సీఎం మనవడు చేసిన ఓ మంచి పని ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి గురించి సమాజంలో చర్చ మొదలైంది. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ మనవడు చేసిన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. కాగా రాష్ట్రంలోని మిగతా స్కూళ్లకు కూడా వెళ్లి చూడాలని హిమాన్షుకు సోషల్ మీడియాలో తెగ రిక్వెస్టులు వస్తున్నాయి.









