ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ కు చేరుకున్నారు. ఉదయం 9.20 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ టైమ్ కంటే 10 నిమిషాల ముందే ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ కావడం గమనార్హం. ఎయిర్ పోర్టులో ప్రధానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వరంగల్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో బయల్దేరారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను మరో రెండు హెలికాప్టర్లు అనుసరించాయి.
వరంగల్ భద్రకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ పర్యటన నేపథ్యంలో మామునూరు చేరుకుని భద్రకాళి ఆలయాన్ని సందర్శించేందకు వచ్చిన ప్రధాని మోదీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రధాని ప్రదక్షిణ చేశారు. తర్వాత ఆలయ ఆవరణలో గోశాలలో నిర్వహించిన గో సేవలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు.









