ఫలక్‌నుమా ప్రమాదం వెనుక విద్రోహచర్య ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు మూడు రోజుల క్రితమే ఒక బెదిరింపు లేఖ అందింది. త్వరలో బాలాసోర్ తరహా ఊహకందని ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందని ఫ్రమ్ అడ్రస్ లేని ఆ లేఖలో పేర్కొన్నారు. వారంలో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ – ఢిల్లీ మార్గంలో ఘటన జరుగుతుందని హెచ్చరించాడు.
ఆగంతకుడి నుంచి దాదాపు నాలుగు రోజుల క్రితం ఈ వార్నింగ్ లెటర్ అధికారులకు చేరింది. దాంతో వెంటనే అలెర్టయిన అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల కిందట రైల్వే అధికారులు తమకు సమాచారం అందించారని నార్త్‌జోన్ డీసీపీ చందనాదీప్తి చెప్పారు. లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. లేఖ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.









