కొండచరియలు విరిగిపడి కార్లపై పడిన బండరాయి
నాగాలాండ్ రాజధాని సమీపంలో ఘోర ప్రమాదం
మృత్యువు ఎప్పుడు ఎలా తరుముకొస్తుందో తెలియదనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఉన్నట్టుండి కొండచరియలు విరిగిపడి ఓ పెద్ద బండరాయి (Giant Boulders) వాహనాలపై దూసుకొచ్చింది. దీంతో మూడు కార్లు పూర్తిగా నుజ్జనుజ్జయ్యాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన నాగాలాండ్‌లోని (Nagaland) చుమౌకేదిమా జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అధికారుల కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో వర్షం కురుస్తుండటంతో నాగాలాండ్ రాజధాని కోహిమా- దిమాపుర్ 29వ నెంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో పకల్ పహర్ వద్ద పదుల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇంతలో పక్కనే ఉన్న ఎత్తైన కొండపై నుంచి ఓ భారీ బండరాయి ఊడిపడి రహదారిపైకి దొర్లుకుంటూ వచ్చి, తొలుత ఓ కారుపై పడటంతో అది నుజ్జునుజ్జయింది. ఆ తర్వాత ఆ రాయి పక్కనే ఉన్న మరో కారును ఢీ కొట్టింది. దీంతో అదికూడా పూర్తిగా ధ్వంసమైంది. ఇంకొకటి మరో కారును ఢీకొట్టడంతో మూడు కార్లలోని ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. మొదట ఢీకొట్టిన కారులోని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించగా.. ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు.. ధ్వంసమైన కార్ల వెనుక నిలిచిన వాహనాలకు అమర్చిన కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బండరాయి బలంగా ఢీకొట్టడంతో కార్లు నుజ్జునుజ్జు కావడంతో లోపలి చిక్కుకున్న ఓ వ్యక్తిని బయటకు తీయడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.









